భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించినప్పుడే వివక్ష లేని సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తహశీల్దార్ మాలతి తెలిపారు. కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో మెలగాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలని సూచించారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ సంగని సునీత యాదగిరి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ మాలతి, SI శివానందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌర హక్కుల ప్రాధాన్యత, సామాజిక సమానత్వం, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాలతి, SI శివానందం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి అనేక హక్కులను కల్పించిందని తెలిపారు. ఆ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు వాటిని గౌరవించాలని చెప్పారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సమాజంలో ఇప్పటికీ కనిపిస్తున్న అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అసమానతలు వంటి దురాచారాలను పూర్తిగా తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కులం, మతం, వర్గం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడాలని తెలిపారు. పౌర హక్కులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, సమాజం పట్ల తమ బాధ్యతలను గుర్తించి నడుచుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజిక అసమానతలను తగ్గించవచ్చని, అందరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించే సమాజ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగని సునీత యాదగిరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, వినయ్, ఉపసర్పంచ్ కుంట రాజు, వార్డు సభ్యులు నాగమణి, శేఖర్ యాదవ్, మానస మహేష్, సంగని జైపాల్, మాజీ ఉపసర్పంచ్ మనోజ్ కుమార్, గ్రామస్తులు యాదగిరి, సంజీవ్, గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.