భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఎల్నినో ప్రభావం, సాగునీటి కొరత, విద్యుత్ సరఫరా సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కరువు మండలాల జాబితాలో ఈ రెండు మండలాలను చేర్చకపోవడం బాధాకరమని తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రాంపూర్, ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిస్టాపూర్ గ్రామాల్లో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, దుబ్బాక నియోజకవర్గంలోనూ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. ఇప్పటికే బోర్లలో నీళ్లు లేకపోవడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు పంటల సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని గుర్తుచేశారు. గత ఏడెనిమిదేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్లలో నీటిని నిల్వ చేసి, కాలువల ద్వారా చెరువులు, కుంటలకు సాగునీరు అందించడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టుల్లో నీటిని అందుబాటులో ఉంచి ఉంటే రైతులకు కొంతమేర ఉపశమనం లభించేదని అన్నారు. ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం రైతులపై పడకూడదని, రైతులు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సాగునీటి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు చేగుంట మండలంలోని లంబాడీ తండాల్లో నివసించే గిరిజన కుటుంబాలు వ్యవసాయ కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అందుబాటులో లేకపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం లేదని, దీంతో గిరిజన కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. పంటలు సాగు చేసుకునే పరిస్థితులు లేకపోవడం ఒకవైపు, కూలీ పనులు దొరకకపోవడం మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని తెలిపారు.
ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మెదక్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజన కుటుంబాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ రెండు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని BRS పార్టీ తరఫున, రైతుల తరఫున, గిరిజన సోదరుల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.