భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

వావిలాలలో ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన

వావిలాలలో ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్రామ సర్పంచి గోగుల మమతా ప్రశాంత్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ, కేవీకే సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూసార పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై రైతులకు వివరించారు.

కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. రసాయన ఎరువులను మితిమీరి వినియోగించడం వల్ల భూమి సహజ సారం దెబ్బతింటోందని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవాలంటే భూసారాన్ని మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు. సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుకోవచ్చని చెప్పారు.

వావిలాలలో ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన

రైతులు ఒకే రకమైన పంటను పదేపదే సాగు చేయకుండా పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని సుహాసిని సూచించారు. పంట కోతల అనంతరం మిగిలే వ్యర్థాలను పొలాల్లోనే కాల్చకుండా భూసారాన్ని పెంపొందించేలా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ విధానాల ద్వారా నేల నాణ్యతను కాపాడుకోవచ్చని వివరించారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు సాగు ప్రణాళికలో తగిన మార్పులు చేసుకోవాలని ఏడీఏ సూచించారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. నీటిపై ఎక్కువగా ఆధారపడే పంటలను సాగు చేసి ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కోవద్దని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓలు మణికంఠ, ధరనీష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.