భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేత దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం రెవెన్యూ పరిధిలోని మీట్యా తండా సమీపంలో నిర్వహిస్తున్న ఈ క్వారీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు క్లోజింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు తండావాసులు వెల్లడించారు.
సర్వే నంబర్లు 152, 182లో కొనసాగుతున్న మోహన్ గ్రానైట్ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ తవ్వకాలు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా క్వారీ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీజు గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలను పట్టించుకోకుండా అత్యంత లోతు వరకు తవ్వకాలు చేపడుతూ గ్రానైట్ రాళ్లను వెలికితీస్తున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తండావాసుల ఫిర్యాదుపై స్పందించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు క్వారీ మూసివేతకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
అధికారుల ఆదేశాల నేపథ్యంలో మోహన్ గ్రానైట్ క్వారీ త్వరలోనే మూతపడే అవకాశం ఉందని మీట్యా తండావాసులు చెబుతున్నారు. అయితే క్వారీ మూసివేతకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.