భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు

దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం హైస్కూల్ ఆవరణలో శనివారం మండలస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు MEO, స్థానిక పాఠశాల హెచ్‌ఎం వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన ఈ పోటీలు జరిగాయి.

మండలంలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ పోటాపోటీగా ముందుకు సాగారు. విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండేలా రన్నింగ్, కుర్చీలాట, పాటల పోటీలు, డ్రాయింగ్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు.

దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం, పరస్పర సహకార భావన పెరుగుతాయని పేర్కొన్నారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేసి పంపించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వి. వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలోనూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, IER పిట్టల యాకాంబ్రావు, PD ప్రణయ్, ఉపాధ్యాయులు రాజు, శ్రీనివాసు, రమేష్, రవీందర్, ఉమతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.