భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు, ఉపాధ్యాయ సంఘం సభ్యుడిగా సంఘ బలోపేతానికి భూసాని సోమయ్య అందించిన సేవలు అపూర్వమని PRTU TS ఎమ్మెల్సీ ఎంగిలి శ్రీపాల్ రెడ్డి కొనియాడారు. పదవీ విరమణ పొందిన సోమయ్య సార్‌ను అభినందిస్తూ, ఆయన సేవలను ప్రశంసించారు.
మండలంలోని నైనాల ప్రాథమికోన్నత పాఠశాలలో భూసాని సోమయ్య పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు స్థానిక సర్పంచి యాసం సంధ్య రమేష్, విద్యార్థులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోమయ్య సార్ దంపతులను పూలమాలలు, శాలువాలు, ప్రశంసాపత్రాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు అభినందనలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎంగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని తెలిపారు. 2003 DSC ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు త్వరలోనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన DAలు, మెరుగైన PRC సాధన కోసం తన వంతు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో PRTU TS జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీధర్, ఉపాధ్యక్షురాలు నూకల గీతారెడ్డి, నెల్లికుదురు మండల అధ్యక్షుడు సొంటిరెడ్డి యుగేందర్ రెడ్డి, కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు గోపాల శ్రీధర్, ఇనుగుర్తి మండల శాఖ అధ్యక్షుడు సూరం భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ముత్తు లింగం, స్థానిక సర్పంచి యాసం సంధ్య రమేష్, ఉపసర్పంచి పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.