భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి: BRS

అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి :బీఆర్ఎస్

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్కన్నపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్‌ను వినిపించారు.

ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. మండలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అక్కన్నపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న BRS నాయకులు, అక్కడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.