భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

APలో రెండు రోజుల సెలవులు..ఎందుకో తెలుసా?

APలో రెండు రోజుల సెలవులు..ఎందుకో తెలుసా?

భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నవంబర్ 5న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి పూర్తయింది. అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య సమీపంలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 219 స్ట్రాంగ్ రూముల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి APSEC నిరంతరం పర్యవేక్షిస్తోంది. మంగళవారం ఉదయం బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సెలవులు పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లోని ప్రైవేట్ సంస్థలు, షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు కల్పించనున్నారు. వాస్తవానికి పరిషత్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగాల్సి ఉండగా, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పుల కారణంగా తేదీలను నవంబర్ 5కు మార్చారు. నవంబర్ 6న రీపోలింగ్ అవసరమైతే నిర్వహించనుండగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇక ఈ పరిషత్ ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 46,045 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి 19,760 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 17,726 మంది, జనసేన నుంచి 4,330 మంది, BJP నుంచి 1,049 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 2,012 మంది పోటీ చేస్తున్నారు.

అదేవిధంగా 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 4,770 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో టీడీపీ నుంచి 1,693 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 1,445 మంది, జనసేన నుంచి 587 మంది, BJP నుంచి 227 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 227 మంది బరిలో ఉన్నట్లు వెల్లడించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.