భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ పంట మార్పిడిని పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. రామాయంపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ (KBA) కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ వంటి అంశాలను అధికారులు వివరించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు.
స్థానిక వాతావరణ, నేల పరిస్థితులకు అనుకూలంగా ఉండే పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని, మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు అధిక లాభాలు పొందేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, సందీప్, ఆత్మ (ATMA) సిబ్బంది ఏటీఎం కిరణ్, రైతులు పాల్గొన్నారు.