భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సుస్థిర జీవనశైలి అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీతానగరం మండలంలోని అన్ని గ్రామాల్లో నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వనరుల పొదుపు, ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ప్రజలకు వివరిస్తున్నారు.
సీతానగరం PHC వైద్యాధికారులు డా. వి. భవాని, డా. ఇ. యేసు రాణి, డా. ఎం. శైలజ రాణి పర్యవేక్షణలో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వనరులను సంరక్షించడంతో పాటు ఆరోగ్యకరమైన, సుస్థిర జీవనశైలిని అలవర్చుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు.