భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ జె. శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్‌తో కలిసి పట్టణంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రెండు అమృత్ 2.0 వాటర్ ట్యాంకులతో పాటు రాయారావు చెరువు, వాటర్ బాడీ పునరుజ్జీవన పనులను తనిఖీ చేశారు. పనులు ఏ దశలో ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్ణీత గడువులోగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో పబ్లిక్ హెల్త్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. కిష్టయ్య, కాంట్రాక్టర్లు సోమరాజు, వెంకటేష్ గౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.