భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కోహెన్స్ ఫార్మాపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు వినతి

కోహెన్స్ ఫార్మా కంపెనీపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలి

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ఉద్యోగి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్, సీపీఐ, తండాల నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ కాలుష్యం, స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలపై వాస్తవాలను వెలికితీయాలని కోరుతూ ఈ రోజు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కంపెనీలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు బయటపడాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విచారణ పూర్తయ్యే వరకు కోహెన్స్ ఫార్మా కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయాలని నాయకులు కోరారు. కంపెనీ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తేలితే దానిని పూర్తిగా మూసివేయాలని లేదా జనావాసాలకు దూరంగా తరలించాలని స్పష్టం చేశారు. కార్మికుల భద్రతతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కంపెనీలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ₹.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన కంపెనీ యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కంటే కంపెనీ లాభాలకే ప్రాధాన్యత ఇచ్చే ధోరణిని ప్రభుత్వం విడనాడాలని నాయకులు అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, స్థానిక ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ సీనియర్ నాయకులు చామల అశోక్ కుమార్, మాస్ లైన్ నాయకులు పేర్ల నాగయ్య, చక్రు నాయక్, శివరామ్, పిఓడబ్ల్యు నాయకులు జయమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.