భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

పట్టభద్రులారా అలర్ట్.. 6వ తేదీనే లాస్ట్ డేట్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోండి: కందుకూరి లక్ష్మయ్య

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి లక్ష్మయ్య కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి MLA మందుల సామెల్ ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసే దిశగా ఆయన ఈ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వాములు కావాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం తప్పనిసరని లక్ష్మయ్య తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమతో పాటు చదువుకున్న స్నేహితులు, సహచర పట్టభద్రులకు కూడా ఓటరు నమోదుపై సమాచారం అందించాలని కోరారు.

పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులందరూ చురుగ్గా పాల్గొనాలని, తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోకూడదని కందుకూరి లక్ష్మయ్య పిలుపునిచ్చారు.