భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో చిన్నశంకరంపేట PM శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థిని బి. ఆర్తి చంద్ర ప్రథమ బహుమతి సాధించడం పట్ల మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని సాధించిన విజయాన్ని అభినందిస్తూ, ఈ ఘనత వెనుక కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను సోమవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వాణికుమారితో పాటు ఉపాధ్యాయులు నర్సింలు, రవిబాబు, దేవిసింగ్లను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో మాక్ పార్లమెంట్ వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు.
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విద్యార్థులు భాగస్వాములు కావాలని, తద్వారా సమాజ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆర్తి చంద్ర ప్రథమ బహుమతి సాధించడం పాఠశాలకు గర్వకారణమని, ఈ విజయం సాధించడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రతిమా సింగ్ ప్రశంసించారు.