భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన సమస్యల దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చిన్నశంకరంపేట ఎంపీడీవో దామోదర్ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో ప్రజావాణి ద్వారా మొత్తం 18 దరఖాస్తులు అందగా, వాటిలో 9 పరిష్కరించినట్లు చెప్పారు. మరో 9 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా భూ సమస్యలకు సంబంధించిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపడంతో పాటు, అవసరమైన నోటీసులు కూడా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మెదక్‌లో నిర్వహించే ప్రజావాణికి సమర్పించిన దరఖాస్తుల్లో చిన్నశంకరంపేట మండలానికి సంబంధించిన సమస్యలను కూడా స్థానిక శాఖలకు పంపిస్తారని ఎంపీడీవో వివరించారు. అయితే మండల పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజలు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా దరఖాస్తులు అందజేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దామోదర్ తెలిపారు.