భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నీటిని ఒడిసిపడదాం.. నెల్లికుదురులో వినూత్న ప్రచారం

నీటిని ఒడిసిపడదాం.. నెల్లికుదురులో వినూత్న ప్రచారం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో నీటి సమస్యను ముందుగానే అధిగమించేందుకు నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో పొందుపరిచిన సందేశాలు, చిత్రాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండటంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే కూడలి కావడంతో చాలామంది ఫ్లెక్సీని ఆసక్తిగా పరిశీలిస్తూ నీటి సంరక్షణపై అవగాహన పెంచుకుంటున్నారు.

నీటిని ఒడిసిపడదాం.. నెల్లికుదురులో వినూత్న ప్రచారం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎంపీడీవో ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుచూపుతో చేపడుతున్న ఈ అవగాహన కార్యక్రమాలపై మండల ప్రజలు ఎంపీడీవోను అభినందిస్తున్నారు.

ఇంటింటికీ ఇంకుడు గుంత.. అందరి బాధ్యత

నీటిని ఒడిసిపడదాం.. నెల్లికుదురులో వినూత్న ప్రచారం

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం అందరి బాధ్యత అని ఎంపీడీవో సింగారపు కుమార్ స్పష్టం చేశారు. సోమవారం నెల్లికుదురు అంబేద్కర్ సెంటర్‌లో స్థానిక తహసీల్దార్ చంద నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజావాణి అధికారులు, జర్నలిస్టులతో కలిసి ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజావాణిలో పాల్గొనే 28 శాఖల అధికారులు సైతం తమ పరిధిలోని ప్రజలకు ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరించి చైతన్యపరచాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని తెలిపారు. వినియోగించిన నీటిని వృథాగా బయటకు వదలకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు బండి శ్రీనివాస్, కత్తుల కళ్యాణి యాకాంతం, MPO యాసం వెంకటరమణ, APM నరేంద్ర కుమార్, జర్నలిస్టులు పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్, గొల్లపల్లి విజయ్ బాబు గౌడ్, బొడ్డు అశోక్, మస్కపురి కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.