భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ IPS పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన శంకరంపేట-ఆర్, చేగుంట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా CCTNS, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో తూప్రాన్ CI వెంకట రాజా గౌడ్, శంకరంపేట-ఆర్ SI శివనందం, చేగుంట SI చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.