భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గంజాయి అక్రమ రవాణా కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కేసముద్రం CI వై. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో నెల్లికుదురు SI గంగారపు కరుణాకర్‌తో కలిసి నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హనుమాన్‌పురకు చెందిన కాపుగేరి రాజు తన సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతం నుంచి సుమారు 2 కిలోల 400 గ్రాముల గంజాయిని కొనుగోలు చేశాడు. దానిని హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో అప్పటి నుంచి నిందితుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చేపట్టి మహబూబ్‌నగర్ పట్టణంలోని నిందితుడి ఇంట్లో రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి Apple కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలి: CI
మత్తు పదార్థాల రహిత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కేసముద్రం CI వై. సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా, మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అభివృద్ధితో కూడిన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని CI సత్యనారాయణ కోరారు.