భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వరి కోతలు జరుగుతున్న సమయంలో హార్వెస్టర్ కింద పడి ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లంబాడి శంకర్ నాయక్ (46) ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కింద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డ తాండాకు చెందిన లంబాడి శంకర్ నాయక్, తండ్రి మాన్సింగ్, గత పదేళ్లుగా కొండాటి అనుమంతరావుకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 11:30 గంటలకు తన పొలంలో పండించిన వరి పంటను కోయించేందుకు గ్రామానికి చెందిన హార్వెస్టర్‌ను తీసుకెళ్లాడు.

హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

వరి కోతలు కొనసాగుతున్న సమయంలో హార్వెస్టర్ ఆపరేటర్ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్లాడు. అదే సమయంలో శంకర్ నాయక్ ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రైతు మృతితో కుటుంబంలో తీరని విషాదం

హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

ఈ ఘటనపై మృతుడి భార్య లంబాడి బుజాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వెల్దుర్తి SI బి. కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతుడు శంకర్ నాయక్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి వ్యవసాయ పనుల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో పెద్దమ్మగడ్డ తాండాలో విషాద వాతావరణం నెలకొంది.