భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ జానకి షర్మిల

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టప్రకారం విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

కుటుంబ సమస్యలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరు వర్గాలతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం భైంసాలోనే కౌన్సిలింగ్ సదుపాయం కల్పించడంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష

గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఇంకా పరిష్కారం కాని వాటిపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రీవెన్స్ డే మంచి అవకాశమని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.