భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స ఆలస్యం కాకుండా కేంద్ర ప్రభుత్వం PM రహత్ పథకాన్ని అమలు చేస్తోందని నర్సాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రమాద బాధితులు గరిష్ఠంగా ₹.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఈ పథకం కింద వైద్య సేవలు పొందే అవకాశం ఉందని వివరించారు. బాధితుల ఆదాయంతో సంబంధం లేకుండా పథకంలోని నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పట్టణ, గ్రామీణ రహదారులపై జరిగే మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన వారికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేయాలి
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని ఎస్ఐ సూచించారు. గాయపడిన వారిని వీలైనంత త్వరగా సమీపంలోని PM రహత్ గుర్తింపు పొందిన ఆసుపత్రికి తరలించాలని కోరారు. ఆసుపత్రి సిబ్బందికి PM రహత్ పథకం కింద చికిత్స పొందాలనే విషయాన్ని తెలియజేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని రంజిత్ రెడ్డి అన్నారు. డబ్బుల సమస్యతో ఎవరూ వైద్య చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
PM రహత్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరి అప్రమత్తత మరొకరి ప్రాణానికి రక్షణగా నిలుస్తుందని ఎస్ఐ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.