భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

చట్టాలపై అవగాహనే.. విద్యార్థులకు అసలైన ఆయుధం!

ఎల్లంకి డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం  విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవా

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థి దశ నుంచే చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎస్ఐ-2 జగన్నాథ్, సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపారాణి సూచించారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్‌లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్ఐ-2 జగన్నాథ్, సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపారాణి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లగండ్ల అశోక్ కుమార్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు, బాలలపై వేధింపులు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు, పోక్సో చట్టం, బాలల హక్కులు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగినా, తాము బాధితులుగా మారినా భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి చట్టబద్ధంగా న్యాయం పొందాలని సూచించారు.

ఎల్లంకి డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం  విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవా

ఆర్థిక ఇబ్బందులు న్యాయానికి అడ్డుకాకూడదు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థలు అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులు కార్యక్రమంలో తెలుసుకున్న న్యాయ విజ్ఞానాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా తెలియజేయాలని పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన కలిగిన యువతతోనే న్యాయబద్ధమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, ఎం. అరుణ, వై. శ్రీనివాస్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.