భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కుటుంబ వాతావరణమే పునాది అని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఇనుగుర్తి ZPHSలో హెచ్ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే తొలి గురువులని తెలిపారు. కేవలం ఆస్తులు కూడబెట్టడమే కాకుండా పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం కూడా తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత అని చెప్పారు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులను ప్రోత్సహించాలి: హెచ్ఎం
విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా తల్లిదండ్రులు ఒత్తిడికి గురిచేయకుండా ప్రోత్సాహం అందించాలని హెచ్ఎం అమ్మ యాకయ్య సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారంపైనా ఆధారపడి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం SA-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను ఇనుగుర్తి గ్రామానికి చెందిన బి. మహేందర్ రెడ్డి సన్మానించి, ఒక్కొక్కరికి ₹.2వేల నగదు బహుమతి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ASI రాఘవరావు, మాజీ సర్పంచి దార్ల రామ్మూర్తి, పింగిలి శ్రీనివాస్, సుమారు 40 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.