భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని శేరిల్లా గ్రామ సర్పంచ్ బంజ లావణ్య రవి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, ఉదయం అందించే టిఫిన్ వంటి అంశాలపై విద్యార్థులను నేరుగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో భోజన నాణ్యత, విద్యా బోధన తీరుతో పాటు విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలు, వారి అవసరాల గురించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించారు.
విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందినప్పుడే వారి సమగ్ర ఎదుగుదలకు అవకాశం ఉంటుందని సర్పంచ్ పేర్కొన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని సర్పంచ్ బంజ లావణ్య రవి తెలిపారు.