భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళల పట్ల గౌరవం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ గౌరవం మాటలకే పరిమితం కాకుండా మన ఆలోచనలు, ప్రవర్తనలోనూ ప్రతిబింబించాలని మెదక్ భరోసా కేంద్రం సిబ్బంది విద్యార్థులకు సూచించారు. మహిళల పట్ల వివక్ష, వేధింపులకు దూరంగా ఉంటూ వారికి సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS ఆదేశాల మేరకు రామాయంపేటలోని స్నేహ కళాశాలలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ సౌమ్య విద్యార్థులకు మహిళల గౌరవం, భద్రత, హక్కులు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఆడపిల్లలు అనే కారణంతో ఎవరినీ తక్కువగా చూడకూడదని, మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సౌమ్య తెలిపారు. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా బాధ్యతలను సమానంగా పంచుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు. మహిళలను కించపరిచేలా జోకులు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరదా పేరుతో జరిగినప్పటికీ అవి ఎదుటివారిని మానసికంగా బాధపెడతాయని, ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలని సూచించారు.

మహిళల పట్ల గౌరవం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని, డిజిటల్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మహిళలపై ఎక్కడైనా వేధింపులు, అనుచిత ప్రవర్తన కనిపిస్తే మౌనంగా ఉండకుండా, తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధితులకు అండగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు అందించే సహాయ సేవల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, వాటిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించారు.

యుక్తవయస్సులో కలిగే ఆకర్షణలు, భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తమ ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని, మహిళల గౌరవం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమానత్వ భావనతో ముందుకు సాగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.