భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరెంటు కోతలు, సాగునీటి కొరతతో చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని నర్సాపూర్ నియోజకవర్గ రైతులు మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హరీశ్ రావు, ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుమార్ అనే రైతు తనకు ఎదురైన పరిస్థితిని వివరిస్తూ కంటతడి పెట్టారు. సకాలంలో కరెంటు సరఫరా లేకపోవడంతో తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని వాపోయారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా నష్టపోవాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందడంతో రెండు పంటలు సాగు చేసుకున్నామని రైతులు తెలిపారు. ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా కాంగ్రెస్ నాయకులు కనీసం తమ సమస్యలను తెలుసుకునేందుకు రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుబంధు విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని రైతులు హరీశ్ రావుకు వివరించారు. పూర్తి స్థాయిలో రైతుబంధు అందించకుండా కేవలం ఒక్క ఎకరానికే నిధులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా గ్రామంలో చాలామందికి అందలేదని, పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తీరుతాయని రైతులు హరీశ్ రావు ఎదుట ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను విన్న హరీశ్ రావు వారికి భరోసా కల్పించారు. అధైర్యపడవద్దని, మరో రెండేళ్ల పాటు రైతుల పక్షాన పోరాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతులకు అందించిన 24 గంటల విద్యుత్, రైతుబంధు పథకాలను నిలిపివేసి పచ్చని పొలాలను ఎండబెడుతోందని విమర్శించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
ఎండిపోయిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న రైతుబంధు నిధులను విడుదల చేయాలని, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.