భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బాలల భద్రతకు గ్రామస్థాయి కమిటీలు కీలకం

బాలల సంరక్షణ లో విసిపిసి కమిటీలు కీలకం                         సర్పంచి సుజాత యాకయ్య

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VICPC) కీలక పాత్ర పోషిస్తాయని చిన్ననాగారం సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. పిల్లలపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపులను అరికట్టడంలో ఈ కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు.

ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో శుక్రవారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, కన్వీనర్‌గా దాసరి కవితతో పాటు మరో 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత యాకయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ICDS, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు అందిస్తున్న వివిధ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

బాలల సంరక్షణ లో విసిపిసి కమిటీలు కీలకం                         సర్పంచి సుజాత యాకయ్య

ఇబ్బందులకు గురైతే 1098కు ఫోన్ చేయాలి: సూపర్వైజర్ సుధారాణి

ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ సుధారాణి మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడం, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపుల నుంచి వారిని రక్షించడం విసిపిసి కమిటీల ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ అంశాలపై పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు.

బాలికలు, పిల్లలు ఎవరైనా ఇతరుల నుంచి ఇబ్బందులు లేదా వేధింపులకు గురైతే భయపడకుండా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. బాలల భద్రత విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు దాసరి కవిత, చెడుపాక శ్రీలత, వార్డు సభ్యుడు చెడుపాక సురేష్, ఏఏపీసీ చైర్మన్ చెడుపాక కవిత, బత్తిని ఐలయ్య, ఆశా వర్కర్లు అలివేలు, భాగ్యమ్మ, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.