భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపాలి

ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి: ఆంజనేయులు గౌడ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు వెళ్లాలని ఆంజనేయులు గౌడ్ కోరారు. లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ సంతోషాలను పంచుకోవాలని తెలిపారు. వారి ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా, మండల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపాలని ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు.