భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

రికార్డు ధర పలికిన పసుపు మిర్చి.. ఈసారి ఏమవుతుందో?

పసుపు రంగు మిర్చితో అధిక దిగుబడి.

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సాధారణంగా ఎరుపు రంగులో కనిపించే మిర్చి పంటకు భిన్నంగా పసుపు రంగు మిరప సాగుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన రైతు మనోహర్ గౌడ్. తనకున్న ఎకరా 10 గుంటల వ్యవసాయ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా ఎరుపు రంగు మిర్చితోపాటు, గత నాలుగేళ్లుగా పసుపు రంగు మిరప పంటను కూడా సాగు చేస్తున్నారు. గతంలో ఈ పంటకు మంచి ధర లభించడంతో ఈసారి కూడా ఆశతో సాగు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

తాను పండించిన పసుపు రంగు మిర్చిని వరంగల్‌లోని ఎనుముల వ్యవసాయ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు మనోహర్ గౌడ్ చెప్పారు. గతంలో ఈ మిర్చికి క్వింటాల్‌కు ₹.42వేల వరకు రికార్డు స్థాయిలో ధర లభించిందని వెల్లడించారు. గత రెండేళ్లలో మంచి ధర పలకడంతో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ధర వస్తుందనే అంచనాతో పంట సాగు చేసినట్లు వివరించారు. తనతోపాటు మరికొందరు రైతులు సైతం పసుపు రంగు మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

పసుపు రంగు మిర్చితో అధిక దిగుబడి.

అయితే ఈసారి వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఒకవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మరోవైపు వర్షపాతం తగ్గడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని మనోహర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఈసారి ఆశించిన లాభాలు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

పసుపు రంగు మిర్చికి వ్యవసాయ మార్కెట్‌లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వినియోగం ఉందని మనోహర్ గౌడ్ తెలిపారు. ఆయుర్వేదిక్, కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలోనూ, ఆరోగ్యపరమైన అవసరాలకు కూడా ఈ మిర్చి ఉపయోగపడుతుందని వివరించారు. గతంలో మంచి ధర అందించిన ఈ పంట ఈసారి కూడా తమకు లాభాలు తెచ్చిపెడుతుందని రైతులు ఆశిస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు, పంట దిగుబడి ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది.