భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మెదక్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి: కలెక్టర్

జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరిసి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ సంబరాలతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అధిక శబ్దం, వాయు కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు దూరంగా ఉంటూ పర్యావరణానికి హాని కలగకుండా బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు తప్పనిసరిగా దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

దీపావళి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.