భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

బాలల భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

గ్రామస్థాయిలో విసిపిసి కమిటీలు కీలకం                         సర్పంచి కళ్యాణి యాకాంతం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత విషయంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCPC) కీలక పాత్ర పోషిస్తాయని రావిరాల గ్రామ సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం తెలిపారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతోపాటు, వారిపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో శనివారం ఐసీడీఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో స్థానిక UPSలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా గ్రామ సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్ కరుణను నియమించారు. వీరితోపాటు మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా సర్పంచి కళ్యాణి యాకాంతం మాట్లాడుతూ ప్రభుత్వం ఐసీడీఎస్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలకు అందిస్తున్న వివిధ సేవలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా గ్రామంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

1098కు ఫోన్ చేయాలి: సూపర్వైజర్ సరిత

బాలికలు, చిన్నారులకు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 1098 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత సూచించారు. పిల్లలపై జరిగే నేరాల నియంత్రణ, బాల్యవివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా అరికట్టడం, శారీరక, మానసిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.

బాలల హక్కులు, రక్షణ చర్యలపై పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించడంలో విసిపిసి కమిటీ సభ్యులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. గ్రామంలో బాలలకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల HM గాయపు లింగారెడ్డి, అంగన్వాడీ టీచర్లు కరుణ, సుభద్ర, ఆశా వర్కర్ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.