భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కంటతడి పెట్టిస్తున్న ఏనుగు పిల్ల మాయ..

కంటతడి పెట్టిస్తున్న ఏనుగు పిల్ల మాయ..

భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : తల్లి ప్రేమకు దూరమై పుట్టినప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఓ ఏనుగు పిల్ల ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. కేరళలో గుంపు నుంచి విడిపోయి అనాథగా మిగిలిన 18 నెలల ఏనుగు పిల్ల మాయ తీవ్ర ఎముకల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించి కనీసం నిలబడలేని స్థితికి చేరుకోవడంతో మెరుగైన వైద్యం కోసం కేరళ అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 6న మాయను ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. అక్కడ అనంత్ అంబానీకి చెందిన వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో ఆమెకు అధునాతన వైద్యం అందించనున్నారు.

మాయ కథ 2025 ఏప్రిల్ 19న ప్రారంభమైంది. కేరళలోని మలయాత్తూర్ అటవీ ప్రాంతం, కప్రిక్కాడ్ సమీపంలో అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లను అటవీ అధికారులు గుర్తించారు. తల్లి, ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఆ చిన్నారి తీవ్ర బలహీనత, డీహైడ్రేషన్‌తో బాధపడుతోంది. దీంతో అధికారులు ఆమెను రక్షించి కొడనాడ్‌లోని అభయారణ్యానికి తరలించారు. అక్కడ పశువైద్యులు, సంరక్షకులు ప్రత్యేక శ్రద్ధతో పెంచారు. ముఖ్యంగా నిఖిల్ బాబు అనే సంరక్షకుడితో మాయకు మంచి అనుబంధం ఏర్పడింది.

అయితే 2026 జూలైలో ఆడుకుంటూ జారిపడిన ఘటన తర్వాత మాయ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎముకలు బలహీనపడటంతో కాళ్లకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ఛాతీలో ఇన్ఫెక్షన్, ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పుండ్లు కూడా వచ్చాయి. అక్టోబర్ 29న వైద్య బృందం ఆమె పరిస్థితిని పరిశీలించి కారుణ్య మరణాన్ని సిఫార్సు చేసింది. అయితే మరో వైద్య అభిప్రాయం తీసుకున్న నిపుణులు పారాథైరాయిడ్ సంబంధిత సమస్య ఉండవచ్చని అనుమానించారు. దీంతో చికిత్సకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

ప్రస్తుతం జామ్‌నగర్‌లోని వంతారా కేంద్రంలో మాయకు ప్రత్యేక వైద్య పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, నొప్పి నివారణ చికిత్స అందించనున్నారు. అవసరాన్ని బట్టి హార్మోన్ చికిత్స, హైడ్రోథెరపీ వంటి విధానాలను కూడా పరిశీలించనున్నారు. నాలుగు నుంచి ఆరు నెలల పాటు చికిత్స కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మాయకు సుపరిచితుడైన సంరక్షకుడు నిఖిల్ బాబు కూడా ఆమెతో పాటు వెళ్లారు. చికిత్సకు ఆమె శరీరం ఎలా స్పందిస్తుందోనన్న దానిపై వైద్యులు పరిశీలన జరపనున్నారు. కోలుకున్న తర్వాత తిరిగి కేరళకు తీసుకెళ్లాలని అధికారులు ఆశిస్తున్నారు.