భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

రైతుల గోల్డ్ లోన్లపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు..

రైతుల గోల్డ్ లోన్లపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు..

భార‌త్ స‌మాచార్, వ్య‌వ‌సాయం : బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ప్రాధాన్యత రంగ రుణాల (Priority Sector Lending – PSL) నిబంధనలను సమీక్షిస్తూ నవంబర్ 5న కొత్త ముసాయిదా విడుదల చేసింది. వ్యవసాయ రుణాలను కేవలం తాకట్టు పెట్టిన బంగారం విలువ ఆధారంగా మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. రైతులు సాగు అవసరాల కోసం ఎంత రుణం తీసుకోవాల్సి ఉందో, పంటల సాగుకు అవసరమైన ఆర్థిక అంచనాల ఆధారంగా బ్యాంకులు రుణ మొత్తాన్ని నిర్ణయించాలి. ఈ ముసాయిదాపై నవంబర్ 26 వరకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.

కొత్త ప్రతిపాదనల ప్రకారం వ్యవసాయ రుణాలను PSL కింద పరిగణించేందుకు బ్యాంకులు కొన్ని కీలక వివరాలను నమోదు చేయాలి. రైతు సాగు చేస్తున్న భూమి ఎక్కడ ఉంది? ఏ పంటలు పండిస్తున్నారు? పంటలపై తాకట్టు లేదా హక్కుల వివరాలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలను పరిశీలించాలి. అంతేకాకుండా, మంజూరు చేసిన రుణం నిజంగా వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులు నిర్వహించే క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను కూడా రికార్డుల్లో ఉంచాలి.

అయితే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నంత మాత్రాన ఆ రుణం ప్రాధాన్యత రంగ రుణాల అర్హత కోల్పోదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అసలు రుణం ఏ ప్రయోజనం కోసం ఇచ్చారు? దాన్ని ఎలా వినియోగిస్తున్నారు? అనే అంశాలే కీలకమని తెలిపింది. భూమి రికార్డులు లేదా కౌలు ఒప్పంద పత్రాలు లేని భూమిలేని వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల విషయంలోనూ ప్రత్యామ్నాయ ఆధారాలతో అర్హతను పరిశీలించవచ్చు.

ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రుణాల పేరుతో ఇతర అవసరాలకు నిధులు మళ్లించడాన్ని అరికట్టడం, నిజమైన రైతులకు రుణాలు అందేలా చూడటం. రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం పొందే అవకాశం కొనసాగుతుంది. అయితే రుణం మంజూరుకు ముందు, తర్వాత బ్యాంకుల పరిశీలన మరింత కీలకం కానుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదనలు మాత్రమే. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత ఆర్‌బీఐ తుది మార్గదర్శకాలను ప్రకటించనుంది.