భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రామాయంపేట ప్రజావాణికి 12 ఫిర్యాదులు : ఎంపీడీవో

రామాయంపేట ప్రజావాణికి 12 ఫిర్యాదు

భార‌త్ స‌మాచార్, మెదక్ జిల్లా : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రామాయంపేటలో మంచి స్పందన లభించింది. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో షాజీలుద్దీన్ వెల్లడించారు. వివిధ సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులను స్వీకరించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యాశాఖలకు సంబంధించి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. మొత్తం 12 దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

రామాయంపేట ప్రజావాణికి 12 ఫిర్యాదు

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ప్రజలు తమకు సంబంధించిన ప్రభుత్వ శాఖల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో షాజీలుద్దీన్ కోరారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. రవీందర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.