భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఎల్‌నినో ప్రభావానికి రైతులు సిద్ధం కావాలి : మంత్రి వివేక్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలి*  *నీటి లభ్యతను బట్టి పంట

భార‌త్ స‌మాచార్, మెదక్ జిల్లా : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే పంటల మార్పిడిపై దృష్టి సారించాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, వ్యవసాయంతో పాటు పశుపోషణను ఆదాయ వనరుగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు జలాల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

సోమవారం నర్సాపూర్ మండలం రాంచంద్రాపూర్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పశుసంవర్ధక శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పశువులు, గొర్రెలకు గాలికుంటు, నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, భూగర్భ జలమట్టాలు సుమారు మూడు మీటర్లు పడిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బోర్‌వెల్స్ సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని కోరారు.

రైతులకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు అవసరమని, కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్, మరమ్మతుల విషయంలో సాంకేతిక అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. సింగూరు జలాల వినియోగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి మెదక్ జిల్లా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పశుసంపద అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.