భారత్ సమాచార్, మెదక్ : జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, కులవివక్ష ఘటనలను అరికట్టి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. సోమవారం నర్సాపూర్ పర్యటనకు వచ్చిన మంత్రిని మెదక్ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ మెదక్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కడారి నాగరాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ, జేఎంఎం రాష్ట్ర నాయకుడు ఊరట్ల శివ, ఎంసీఎఫ్ జిల్లా నాయకుడు ఆనంద్, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు భిక్షపతి మాట్లాడుతూ.. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (పీటీ), కుచారం, తూప్రాన్ మండలం కిష్టాపూర్, శివ్వంపేట మండలం నవాబ్‌పేట్ గ్రామాల్లో బతుకమ్మ వేడుకల సందర్భంగా దళితులపై దాడులు, వివక్ష ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కొనాయిపల్లిలో డప్పులు కొట్టినందుకు కనీస వేతనం అడిగిన కారణంగా సర్పంచ్ మన్నె కళ్యాణ్ అనుచరులు సుమారు 40 మంది దళితులపై దాడి చేశారని, ఈ ఘటనలో ముగ్గురు గ్రామపంచాయతీ కార్మికులు కూడా గాయపడ్డారని తెలిపారు.
కుచారం గ్రామంలో దళిత సర్పంచ్ బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆడేందుకు కొందరు మహిళలు నిరాకరించారని, దీనిపై ప్రశ్నించిన సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని నాయకులు పేర్కొన్నారు. కిష్టాపూర్‌లో దళిత మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడాన్ని గతంలో అడ్డుకున్నారని, ఈ ఏడాది వేడుకలు నిర్వహించడంతో పనులకు పిలవడం మానేశారని ఆరోపించారు. నవాబ్‌పేట్‌లో ఊరేగింపు సందర్భంగా వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, హరి గౌడ్, రవి గౌడ్లు చంది సాయిలు, చంది సన్నీ కుమార్‌పై కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని, సన్నీ కుమార్ గొంతుకు గాయాలయ్యాయని తెలిపారు.
వెల్దుర్తి మండలం ఎదులాపల్లిలో బతుకమ్మ వేడుకల సమయంలో, హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా దాడులు జరిగినట్లు కమిటీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు గ్రామాల్లో కులవివక్ష, దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.