భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని CITU జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ MLA క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు ఎదురవుతున్న సమస్యలు, వారి డిమాండ్లను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కడారి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వాటి అమలులో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన గుర్తింపు, వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఆశా వర్కర్లకు నెలకు ₹.18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ESI, PF సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆశా వర్కర్‌కు ₹.50 లక్షల జీవిత బీమా కల్పించడంతో పాటు, మరణించిన సందర్భంలో అంత్యక్రియల ఖర్చుల కింద ₹.50,000 అందించాలని కోరారు. అదేవిధంగా రిటైర్మెంట్ సమయంలో ₹.5 లక్షల బెనిఫిట్స్ ఇవ్వాలని, పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా పారితోషికంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా చెల్లించాలని తెలిపారు.
పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లకు ప్రతి ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వాలని కోరారు. సంవత్సరానికి 20 రోజుల క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతో పాటు, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ లీవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ANM, GNM శిక్షణ పొందిన ఆశా వర్కర్లకు వారి అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించాలని సూచించారు.
రెండో PRC ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనంగా ₹.30,000 చెల్లించాలని నాగరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధంగా రెండు DAలు ఆశా వర్కర్లకు కూడా అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని తెలిపారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం కష్టపడుతున్న ఆశా వర్కర్లకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు. వారి సమస్యలపై నర్సాపూర్ ఎమ్మెల్యే స్పందించి, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని కడారి నాగరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో CITU నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.