భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కులవివక్ష, మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు సమానత్వం, మానవ హక్కులు, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త సంత్ గురు రవిదాస్ అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TAPUS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ తెలిపారు. చేగుంట మండలంలోని PM SHRI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. సంత్ గురు రవిదాస్ ప్రముఖ సంఘసంస్కర్త, తత్వవేత్త, కవి అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలో ఉన్న సీర్ గోవర్ధన్‌పూర్‌లో ఆయన జన్మించారని చెప్పారు. సమాజంలో పాతుకుపోయిన కులవివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలను తొలగించేందుకు గురు రవిదాస్ తన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు.
ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, సమసమాజ స్థాపన వంటి భావనలు నేడు మనం విస్తృతంగా చర్చిస్తున్నప్పటికీ, గురు రవిదాస్ దాదాపు 500 సంవత్సరాల క్రితమే తన కవిత్వం ద్వారా ఈ గొప్ప ఆలోచనలను సమాజానికి పరిచయం చేశారని వివరించారు. మనుషుల మధ్య కులం, మతం ఆధారంగా వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, హక్కులు దక్కాలని ఆయన తన రచనల ద్వారా చాటిచెప్పారని తెలిపారు.
గురు రవిదాస్ బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని, ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ కులవివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చల్లా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలు, ఆలోచనలను భావితరాలకు అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TAPUS మండల అధ్యక్షుడు రావుల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు సుమతి, దేశపతి కృష్ణమూర్తి, ఉమాదేవి, ఉపాధ్యాయులు రాజేశ్వర్, రఘుపతి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Do you like this personality?