భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

వాగ్దేవి స్కూల్‌లో అందెశ్రీ ప్రథమ వర్ధంతి

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో అందెశ్రీ వర్ధంతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపిరి పోసి, ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాకవి అందెశ్రీకి వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా నివాళులర్పించారు. జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అందెశ్రీ చిత్రపటానికి కట్టయ్య యాదవ్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సాహిత్య సేవలను, తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ వైభవాన్ని చాటిన అందెశ్రీ: కట్టయ్య

ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వైభవాన్ని తన గీతం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కలం వీరుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన కలం నుంచి వచ్చిన ప్రతి అక్షరం సమాజానికి ఒక సందేశాన్ని అందించిందని తెలిపారు.

అందెశ్రీ రచించిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ప్రజల్లో కలిగించిన స్ఫూర్తి, చైతన్యం ఎంతో గొప్పదని కట్టయ్య యాదవ్ చెప్పారు. సమాజంలో క్రమంగా కనుమరుగవుతున్న మానవత్వాన్ని ఈ పాట అద్దం పట్టిందని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన గేయాలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, సాహిత్య ప్రపంచంతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడు అందెశ్రీ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రజాకవికి నివాళులర్పించారు.