భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా మున్సిపాలిటీలో మరో లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లు విషయంలో ₹50 వేల లంచం తీసుకుంటూ మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రాండ్ కుబేర హోటల్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
భైంసా మున్సిపాలిటీలో ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన ₹2 లక్షల 63 వేల బిల్లు విషయంలో ఇన్‌చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ ₹50 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధిత కాంట్రాక్టర్ ACB అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు పథకం ప్రకారం ట్రాప్ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో నిర్మల్ పట్టణంలోని గ్రాండ్ కుబేర హోటల్ వద్ద కాంట్రాక్టర్ నుంచి ₹50 వేల నగదును ఇన్‌చార్జి కమిషనర్ తీసుకుంటుండగా ACB అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ACB DSP మధు వెల్లడించారు. జాదవ్ సంతోష్ కుమార్‌ను కరీంనగర్‌లోని ACB ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
భైంసా మున్సిపాలిటీలో వరుస ACB ఘటనలు
ఇదిలా ఉండగా, గతంలో ఇదే భైంసా మున్సిపాలిటీలో కమిషనర్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు కూడా ₹30 వేల లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు. ఆ ఘటన మరువకముందే ప్రస్తుత ఇన్‌చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ సైతం లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
ఒకే మున్సిపాలిటీలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు వేర్వేరు సందర్భాల్లో లంచం ఆరోపణలతో ACBకి చిక్కడం పట్టణ ప్రజల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలతో భైంసా మున్సిపాలిటీ ప్రతిష్ఠ మరోసారి నిర్మల్ జిల్లాలో చర్చకు దారితీసింది.