భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం మీట్యా తండాలో జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు చేశారు. తండాలో విద్యుత్ వెలుగుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ లైట్‌ను ఏర్పాటు చేసినట్లు బీజేపీ జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో సోలార్ లైట్ ఏర్పాటు చేయాలని గతంలో హుస్సేన్ నాయక్‌ను కోరగా, ఆయన స్పందించి CFR నిధుల సహాయంతో సోలార్ లైట్ మంజూరు చేయించారని చెప్పారు.
తండా అభివృద్ధికి ప్రత్యేక చొరవ
మీట్యా తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, స్వచ్ఛమైన నీరు అందక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గతంలో హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు నవీన్ నాయక్ గుర్తు చేశారు. ఈ సమస్యపై ఆయన వెంటనే స్పందించి రూ.5 లక్షలతో తండాలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారని తెలిపారు. తండా ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
బీజేపీ అధికారంలో లేకున్నా ప్రజలకు అండగా..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ హుస్సేన్ నాయక్ తన వంతుగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని నవీన్ నాయక్ చెప్పారు. రైతులకు స్ప్రే పంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు సైకిళ్లు, ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హుస్సేన్ నాయక్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని నవీన్ నాయక్ తెలిపారు. మీట్యా తండాకు సోలార్ లైట్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఆయన అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. తండా ప్రజల తరఫున హుస్సేన్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయనకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని నవీన్ నాయక్ అన్నారు.