భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, ప్రమాదాల్లో గాయపడినవారిని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
గ్రామ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులుకు కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అదేవిధంగా గ్రామ ఉపసర్పంచ్ మామ కొండి శ్యామయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. కిందపడి కాలు విరిగిన మంత్రి దుర్గయ్యను కూడా పరామర్శించి ఆర్థిక చేయూతనిచ్చారు.
అలాగే ఆరో వార్డు సభ్యుడు ఆకుల వెంకట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి ఆమెను పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నామ్ భూమయ్య భార్య కిందపడటంతో ఆరోగ్యం క్షీణించగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నెల రోజుల క్రితం మృతి చెందిన ఆకుల దుర్గయ్య కుటుంబ సభ్యులను సైతం కలిసి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పడంతో పాటు, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, గ్రామ సర్పంచ్ పులిగిల్ల నారాయణ, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఆకుల వెంకటేశం, ఎడ మహేష్, దుబ్బల సత్యనారాయణ, నాయకులు సతీష్ రావు, చంద్రమోహన్ గౌడ్, గంజి నవీన్, కిరణ్ గౌడ్, ముజీబ్ పులిగిల్ల, లక్ష్మీనారాయణ, వెంకటేష్, వంశీ, ప్రశాంత్, ఉడుత నారాయణ, రవి, నరేందర్, సున్నా నరేష్ తదితరులు పాల్గొన్నారు.