భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

అక్రమ కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయాలని సీపీఐ ధర్నా

లైసెన్సులు లేని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి  మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కొమ్ముల భాస్కర్ డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని విమర్శించారు.

ఈ మేరకు బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ముల భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్ పరిధిలో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండానే వడ్లు, మొక్కజొన్న, పత్తి, అపరాలను బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

మార్కెట్ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మార్కెట్ పరిధిలో జరిగే ప్రతి కొనుగోలు, అమ్మకంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

లైసెన్సులు లేని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి  మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జేరిపోతుల జనార్దన్ మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు న్యాయమైన ధర, ప్రయోజనాలు దక్కేలా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ అధికారులపై ఉందన్నారు. లైసెన్సులు లేకుండా పంటలను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కొనుగోళ్లను అరికట్టి, నిబంధనల ప్రకారం వ్యాపారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ముంజ గోపి, పట్టణ కార్యదర్శి ఎగ్గొజు సుదర్శన చారి, నాయకులు ఎనగందుల లక్ష్మీనారాయణ, మాడిశెట్టి శ్రీధర్, వేల్పుల ప్రసన్న కుమార్, మాచర్ల శ్రీనివాస్, బైరగొని శ్రీనివాస్, బోయిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.