భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

300 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెల్టులు, షూస్

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. గంగాధర్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ఆవరణలో బుధవారం సుమారు 300 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెల్టులు, ఐడీ కార్డులు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని ఉచితంగా సమకూర్చడం ద్వారా వారి చదువుకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి

ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుతూ మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కేవలం విద్యకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి కూడా వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలల వైపు మాత్రమే చూడకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఉచితంగా విద్యా సామగ్రి అందించడం వల్ల విద్యార్థుల్లో ఆనందంతో పాటు చదువుపై మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు.