భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాలల భద్రతకు బడి తండాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

బడి తండాలో బాలల కమిటీ ఎన్నిక..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నెల్లికుదురు మండలం బడి తండాలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VCPC)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృ నాయక్, కన్వీనర్‌గా స్థానిక అంగన్వాడీ టీచర్ వి. కవిత వ్యవహరించనున్నారు.

ఈ మేరకు బుధవారం స్థానిక పాఠశాలలో ICDS సూపర్వైజర్ జలగం సునీత సమక్షంలో 15 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంతో పాటు వారి హక్కులను కాపాడటంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

పిల్లలు, వారి తల్లిదండ్రులకు బాలల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కమిటీలు దోహదపడతాయని చెప్పారు. ముఖ్యంగా బాలల అక్రమ రవాణా, బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు చిన్నారులపై జరిగే వివిధ రకాల వేధింపులు, నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తాయని వివరించారు. బాలల భద్రత విషయంలో గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృ నాయక్, పంచాయతీ కార్యదర్శి కె. భాస్కర్, పాఠశాల HM దేవేందర్, అంగన్వాడీ టీచర్లు వి. కవిత, జి. కవిత, జి. అరుణ, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, విద్యార్థులు పాల్గొన్నారు.