భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ సూచించారు. వ్యవసాయ శాఖ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
శ్రీరామగిరి గ్రామంలో మండల వ్యవసాయ శాఖ AO భూక్య మహేందర్ ఆధ్వర్యంలో బుధవారం కేత్ బచావో అభియాన్, ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మాదరి ప్రశాంత్ అధ్యక్షత వహించగా, గ్రామానికి చెందిన పలువురు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు.
అనంతరం AO భూక్య మహేందర్ కేత్ బచావో అభియాన్ లక్ష్యాలను వివరిస్తూ.. భూసార పరిరక్షణ ఆవశ్యకత, సేంద్రియ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. రాబోయే యాసంగి సీజన్‌లో సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంపై పడే అవకాశం ఉన్న ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి మినుములు, పెసలు, జొన్నలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సలహా ఇచ్చారు. భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే రైతులకు నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, AEO ప్రతిభ, పంచాయతీ సెక్రటరీ సీహెచ్. మౌనిక, PACS CEO కత్తుల వెంకన్న, డైరెక్టర్లు మద్దెల సమ్మయ్య, బెల్లి నర్సయ్య, రైతులు అనుముల రవీందర్, బొమ్మిడీ వినోద్ రెడ్డి, గుర్రాల నరేష్, పోతరాజ్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.