భారత్ సమాచార్, మెదక్ జిల్లా: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట SI నారాయణగౌడ్ యువతకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రామాయంపేటలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం గ్రామానికి చెందిన విజయలక్ష్మి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆమె బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికి, నషా ముక్త భారత్ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
జిల్లా SP ఆదేశాల మేరకు రామాయంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI నారాయణగౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మొబైల్ OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, PIN నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిలో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.
విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాలను వివరించి చైతన్యపరచాలని SI సూచించారు. డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో CI సైదా నాయక్, నిజాంపేట SI రాజేష్, నార్సింగి SI, పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.