భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నాలుగు గ్రామాల్లో నెలకొన్న చీకటి సమస్యకు జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవతో పరిష్కారం లభించింది. ఆయన సహకారంతో NTPC CSR నిధుల ద్వారా నల్లగుట్ట తండా, మేచరాజుపల్లి, పెద్ద తండా, రత్తిరామ్ తండాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ తెలిపారు.
మండలంలోని రత్తిరామ్ తండాలో బుధవారం సోలార్ లైట్ ఏర్పాటు చేసిన సందర్భంగా మదన్ లాల్ మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో సరైన లైటింగ్ సిస్టం లేక ప్రజలు రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, పాదచారులు రాత్రి సమయంలో రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ఈ సమస్యను గుర్తించిన తాము గ్రామాల ప్రజల ఇబ్బందులను జాటోత్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన NTPC CSR నిధుల ద్వారా సోలార్ లైట్లు మంజూరు చేయించడంతో పాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయించేందుకు చొరవ తీసుకున్నారని తెలిపారు.
సోలార్ లైట్ల ఏర్పాటుతో నాలుగు గ్రామాల్లో రాత్రివేళ వెలుగులు నిండాయని, ప్రజలకు ఇబ్బందులు తొలగడంతో పాటు రాకపోకలకు సౌకర్యం కలిగిందని మదన్ లాల్ పేర్కొన్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన హుస్సేన్ నాయక్‌కు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేమని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.