భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

శ్రీరాములపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రామ్

శ్రీరాములపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్  వాహనాల తనిఖీలు.. అక్రమ మద్యం స్వాధీనం

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను తెలుసుకుంటూ పోలీసులపై నమ్మకాన్ని పెంచే లక్ష్యంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సుమారు 50 వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ACP సదానందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. అదే సమయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శ్రీరాములపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్  వాహనాల తనిఖీలు.. అక్రమ మద్యం స్వాధీనం

ఈ సందర్భంగా ACP సదానందం మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కోరారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అలాగే గ్రామాల్లోని వ్యాపార సముదాయాల యజమానులు తమ దుకాణాలు, ఇతర వాణిజ్య ప్రదేశాల వద్ద తప్పనిసరిగా CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ACP సూచించారు. నేరాల నియంత్రణలో CCTV కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా సహకరిస్తూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ CI శ్రీధర్, కోహెడ SI అభిలాష్, అక్కన్నపేట SI ప్రశాంత్, కొమురవెల్లి SI మహేష్, మద్దూరు SI ఆసిఫ్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.