భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఎల్ నినో వాతావరణ దృగ్విషయం, దాని ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్‌లోని కేరళ హైస్కూల్ విద్యార్థులు గురువారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గడం, నీటి కొరత వంటి సమస్యలపై ప్రజలకు వివరించారు. పాఠశాల నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ మాట్లాడుతూ.. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ దృగ్విషయమని వివరించారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతుందని తెలిపారు.
ముఖ్యంగా భారతదేశంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడటంతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం పడటమే కాకుండా తాగునీటి కొరత వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని వివరించారు. అయితే ఎల్ నినో ప్రభావం ప్రతిసారీ ఒకే విధంగా ఉండదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎల్ నినోకు వ్యతిరేకంగా పనిచేసే మరో వాతావరణ దృగ్విషయం లా నినా అని విద్యార్థులకు, ప్రజలకు వివరించారు. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, కార్యదర్శి అల్లే శైలేందర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.